అరుణోదయమవ్వాలని
అభ్యుదయం రావాలని
అడిగేవారు లేకున్నా
ఆగదు ఆ రథం అని
జనం “జనం” కారని
ప్రభంజనం మీరని
జనసామాన్యం నుంచే
జగజ్జేతలొస్తారని
ప్రతి మదిలో విప్లవాగ్ని రగిలించే నిప్పుకణిక కావాలని
జాగ్రుత నవభారత నిర్మాణపు రథ సారధి కావాలని
ఎదురుచూస్తుంది ఈ దేశం.
కుల మత విద్వేషాల కుమ్ములాటలో కుళ్ళినదై
కుటిల రాజకీయ కుతంత్రపు చక్రాల కింద నలిగినదై
అఙానపు అంధకారం అంతులేని పేదరికం అందించిన చేదు గుళికలతో మ్రగ్గినదై
నిర్జీవమై నిస్థేజమై
అనంతమైన బాధల బడబాగ్నులు గుండెలోన దహిస్తున్న
అంబరమంటు ఆర్తనాదాలు హ్రుదయాంతరాలలోన ధ్వనిస్తున్నా
చెదరని చిరునవ్వుతో చెలగిన చిరు ఆశతో
ఎదురుచూస్తుంది ఈ దేశం
నీవైనా కాకూడదా ఆ చైతన్య మూర్తి
అభివ్రుద్ధి పథం వైపు నడిపించు దీప్తి
అచలమై అనంతమై అఖిలమై
నవలోకపు తీరాలను చేర్చు నిత్య సత్య స్పూర్తి
నీవైనా కాకూడదా సమస్త జన సేనాధిపతి
అఖిలాండకోటి జనుల హ్రుదయాలలో వెలుగు ప్రజాపతి
సమసమాజనిర్మాణపు స్థపతి
మహాద్భుత మహోజ్వల మహోగ్ర రాజ్యోద్దీపనాద్యుతి
No comments:
Post a Comment